Chiranjeevi: నాకు క్యాన్సర్ అని చెప్పలేదు…!
Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) క్యాన్సర్ గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఈరోజు ఒక క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ముందే టెస్ట్ చేయించుకున్నాను కాబట్టే తన శరీరంలో ఉన్న పాలిప్స్ క్యాన్సర్‌లా మారలేదు అని ఆయన అన్నారు. దాంతో కొన్ని మీడియా వర్గాలు చిరంజీవికి క్యాన్సర్ అని రాసేసాయి. దాంతో ఆయన మళ్లీ క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేయాల్సి వచ్చింది.
“కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్‌ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్‌గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్‌గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో క్యాన్సర్ కాని పాలిప్స్‌ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి అని చెప్పాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్‌లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టినవారవుతారు” అని తెలిపారు చిరు.