Train Accident: మాన‌వ త‌ప్పిద‌మా? రైలులో లోప‌మా?

Odisha: గ‌త 20 ఏళ్ల‌లో ఎన్నో రైలు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి కానీ శుక్ర‌వారం రాత్రి ఒడిశాలో (train accident) చోటుచేసుకున్న రైలు ప్ర‌మాదం భార‌త‌దేశ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌నిద‌నే చెప్పాలి. ఒక రైలు వేగంగా వెళ్తూ ప‌ట్టాలు త‌ప్పి ప‌క్క‌నే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికైనా గాయాలు అయ్యాయా అని తెలుసుకునేలోపే మ‌రో ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వ‌చ్చి ఆల్రెడీ యాక్సిడెంట్ అయివున్న రైళ్ల‌ను ఢీకొట్టింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900 మంది తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స పొందుతున్నారు. వారిలో ఎంత మంది కోలుకుని ఇంటికి వెళ్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఈ దారుణ ఘ‌ట‌న‌కు కార‌ణం ఎవ‌రు? మాన‌వ త‌ప్పిదమా? రైలులోనే లోప‌మా? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అస‌లు ఈ ఘ‌ట‌న ఎలా చోటుచేసుకుంది అనేదానిపై రైల్వే శాఖ క్షేత్ర స్థాయిలో విచార‌ణ చేప‌డుతున్నట్లు తెలిపింది. ఆల్రెడీ ప‌ట్టాల‌పై స్టేష‌న‌రీ గూడ్స్ రైలు ఆగి ఉన్న‌ప్పుడు.. అదే ప‌ట్టాల‌పై కొర‌మాండ‌ల్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణించ‌డం ఏంటి? ఇది టెక్నిక‌ల్ లోపం అని చెప్ప‌లేం. ఇది క‌చ్చితంగా మాన‌వ త‌ప్పిద‌మే. ఎందుకంటే ఒక ప‌ట్టాల‌పై రెండు రైళ్ల‌ను ఒకేసారి న‌డిపించారంటే క‌చ్చితంగా సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డమే ఇందుకు కార‌ణం. మ‌రోప‌క్క ఇలాంటి ప్ర‌మాదాలు సంబంధించినా భారీ న‌ష్టం జ‌ర‌గ‌కుండా కేంద్ర రైల్వే శాఖ క‌వ‌చ్ అనే యాంటీ కోలిష‌న్ సిస్ట‌మ్ ఇన్‌స్టాల్ చేసేపనిలో ఉంది.

రైలు సిగ్న‌ల్ జంప్ అయిన‌ప్పుడు ఈ క‌వ‌చ్ అలెర్ట్ అవుతుంది. దాంతో క్ష‌ణాల్లో రైల్వే సిబ్బంది అలెర్ట్ అవుతారు. దేశంలో జ‌రిగే దాదాపు అన్ని రైలు ప్ర‌మాదాల్లో స్పాడ్ (సిగ్న‌ల్ పాస్డ్ ఎట్ డేంజ‌ర్) ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు.. ప్ర‌మాదం జ‌రిగిన రైళ్ల‌లో క‌వ‌చ్ ఇన్‌స్టాల్ చేసి లేదు. ప్ర‌మాదానికి ఇదే ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.