Rana: రూ.400 కోట్లు అప్పు తెచ్చి బాహుబ‌లి చేసాం

Hyderabad: బాహుబ‌లి (baahubali) సినిమాను అప్పు తెచ్చి మ‌రీ తెర‌కెక్కించామంటూ ఇంట్రెస్టింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు రానా ద‌గ్గుబాటి (rana). తెలుగు సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన బాహుబ‌లి సినిమా ఏ స్థాయిలో విజ‌యం సాధించిందో మ‌న అంద‌రికీ తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి (rajamouli) విజ‌న్‌ను న‌మ్మి ప్ర‌భాస్ (prabhas), రానా (rana), అనుష్క (anushka) ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్ల పాటు క‌ష్ట‌ప‌డ్డారు. మొత్తానికి క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుని ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా రాబ‌ట్టిన క‌లెక్ష‌న్లు దాదాపు రూ.1000 కోట్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. కానీ ఆ రేంజ్‌లో సినిమా తీయాలంటే కూడా డ‌బ్బు ఉండాలి క‌దా. ఆ డ‌బ్బును ఎలా స‌ర్దుబాటు చేసారో రానా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

“ఓ సినిమా తీయాలంటే నిర్మాత నానా క‌ష్టాలు ప‌డి డ‌బ్బు తెస్తాడు. త‌న ద‌గ్గ‌ర ఉంటే ఫ‌ర్వాలేదు. లేదంటే అప్పుగా తేవాల్సి ఉంటుంది. బాహుబ‌లి విష‌యంలో అదే జ‌రిగింది. దాంతో రాజ‌మౌళి నిర్మాత‌ల‌తో క‌లిసి రూ.300 నుంచి రూ.400 కోట్లు 24-28 శాతం వడ్డీకి అప్పుగా తెచ్చారు. పార్ట్ 1 రిలీజ్ స‌మ‌యంలోనే రూ.180 కోట్లు 24% వ‌డ్డీకి అప్పుగా తెచ్చారు. అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువే అయింది. అంత వ‌డ్డీకి అప్పు చేసి సినిమా తీసాం. సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటో ఊహించ‌డానికి భ‌యంగా ఉంది. ఒక‌వేళ బాహుబ‌లి ఫ్లాప్ అయివుంటే న‌న్ను న‌మ్ముకుని ఐదేళ్ల పాటు నాతో క‌లిసి జ‌ర్నీ చేసిన‌వారు బ‌య‌టికి రాలేని చోట ఉండేవారు క‌దా” అని వెల్లడించారు.