మా దాహం తీర్చండి ప్లీజ్!
ఎండలు దంచికొడుతున్నయ్.. మధ్యాహ్నం వేళ ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక, పలు నగరాలు, పట్టణాల్లో డెవలప్మెంట్, బడా బల్డింగుల నిర్మాణంతో చెట్లను కొట్టేసే పరిస్థితి కనిపిస్తోంది.. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కొంత బెటర్మెంట్ అయినా.. కాంక్రీట్ జంగిల్ వంటి హైదరాబాద్ సిటీలో మాత్రం పక్షలకు ఇబ్బంది తప్పట్లే. అట్లానే రంగారెడ్డి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లోనూ పక్షులను సంరక్షించే చర్యలు తీసుకుందాం. ఈ ఎండాకాలంలో వాటికి కాసిన్ని నీళ్లు అందించి దాహం తీరుద్దాం.. మనుషులుగా మనలోని మానవత్వాన్ని చాటుకుందాం అని పలువురు ప్రకృతి ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు.
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రోహిణి కార్తె ప్రవేశిస్తే రోళ్లు పగులుతాయేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదు నిమిషాలు ఎం డకెళ్లొస్తే గొంతు ఎండుకుపోతున్నది. పది నిమిషాలకోసారి పెదవులపై, గొంతులో నీటి తడి పడకపోతే కండ్లు తిరిగేలా భానుడు మండుతున్నాడు. అన్ని వసతులు ఉన్న మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పక్షులు, ఇతర జీవజాతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం నీరు కూడా లభించక పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎండల తీవ్రతతోపా టు నీరు దొరుకక చనిపోతున్న పక్షుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని ఇటీవల ఓ సర్వే చెప్పిన విషయాలు బాధను కలిగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు పక్షి ప్రేమికులు వాటికోసం ప్రత్యేకంగా నీటి వసతి కల్పిస్తున్నారు. మట్టి, ఇతర పాత్ర ల్లో వాటి కోసం నీటిని పోస్తున్నారు. దాణా కూడా వేస్తున్నారు. పక్షులనే ప్రేమించక పోతే ఇంకా ప్రేమను ఎలా పంచుతామని ప్రశ్నిస్తున్నారు. ‘వీలైతే నీళ్లు పోద్దాం.. కుదిరితే దాణా వేద్దాం డూడ్’ అంటూ పిలుపునిస్తున్నారు.
క్రమక్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి నోరులేని పక్షులు, జంతువుల పరిస్థితి మరెలా ఉంటుందో ఊహకైనా అందదు. అందుకే మన చుట్టూ ఉండే జంతువులు, పక్షుల దాహాన్ని తీర్చేందుకు చిన్న పాత్రల్లో ఆరుబయట నీళ్లు ఉంచితే పెద్ద పుణ్యం చేసినట్లే అవుతుంది.