Harish Shankar: ప్లీజ్.. ఆ సినిమాపై ట్వీట్ డిలీట్ చేయండి

Hyderabad: డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ (harish shankar) ట్విట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌నపై ఆయ‌న సినిమాల‌పై ట్రోలింగ్ ఎక్కువ అయిపోతుండ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడు ట్వీట్స్‌కి రిప్లైలు ఇస్తూ త‌ప్పుగా రాసేవారి నోళ్లు మూయిస్తున్నారు. కాగా.. ఈరోజు ప‌రేషాన్ అనే చిన్న సినిమా ఒక‌టి రిలీజ్ అయింది. మ‌సూద ఫేం తిరువీర్ యాక్ట్ చేసిన ఈ సినిమాను రూప‌క్ రొనాల్డ్‌స‌న్ డైరెక్ట్ చేసారు. అయితే సినిమాలో తెలంగాణ యాస త‌ప్ప ఏమీ లేద‌ని, తెలంగాణ యాస‌ను, ప్రాంతాల‌ను అడ్డుపెట్టుకుని చెత్త సినిమాలు చేస్తున్నార‌ని ఓ వెబ్‌సైట్ రివ్యూ రాసింది. అది హ‌రీష్ శంక‌ర్ కంట ప‌డింది. దాంతో ఆయ‌న ఆ ట్వీట్ డిలీట్ చేయాల‌ని కోరారు.

“స‌ర్‌.. ఇక్కడ అభిప్రాయం కాదు.. భాష ప్ర‌ధానం. సినిమాపై మీకున్న అభిప్రాయాన్ని వెల్ల‌డించే హ‌క్కు మీకు 100% ఉంది. బ‌హుశా రేపు మీ తీర్పునే ఆడియ‌న్స్ క‌రెక్ట్ అనే ఛాన్స్ ఉంది. కానీ ఇలా త‌ప్పుడు భాషలో వ్య‌క్త‌ప‌రిస్తే బుద్ధున్న ఏ వ్య‌క్తీ స‌పోర్ట్ చేయ‌డు. అందులోనూ చిన్న సినిమాల గురించి ఇలా మాట్లాడ‌టం చాలా త‌ప్పు. ప్లీజ్ ఈ ట్వీట్ డిలీట్ చేయండి” అని రిక్వెస్ట్ చేసారు. ప్రస్తుతం హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో (pawan kalyan) ఉస్తాద్ భ‌గత్ సింగ్ (ustaad bhagat singh) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ గాసిప్ వ‌చ్చినా, ఎవ‌రైనా సినిమాపై త‌మ సొంత అభిప్రాయాల‌ను ట్విటర్‌లో షేర్ చేసుకున్నా త‌న దాకా వ‌స్తే హ‌రీష్ శంక‌ర్ (harish shankar) అక్కడిక‌క్క‌డే స‌మాధానం ఇస్తున్నారు. ఇటీవ‌ల సినిమా కాస్త భీమ్లా నాయ‌క్‌లా ఉందంటూ ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కామెంట్ చేయ‌డంతో ఒక్క స‌మాధానంతో ఆయ‌న నోరు మూయించారు.