భద్రాద్రి రామ‌య్య‌ బ్రహ్మోత్సవాలకు వేళాయే..!

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో ఉన్న రాముల వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఏటా అంగరంగ వైభంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున విచ్చేస్తుంటారు. మరోవైపు భద్రాచలం ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో భాగంగానే రాములవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు  ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం జరపనున్నారు. ఈ వేడుకను భక్తులు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు.

వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చు..
ఆదర్శ దంపతులైన సీతారాముల కల్యాణ్యాన్ని వీక్షించాలనుకున్న వారు. టికెట్లను www.bhdrachalamaonline.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. వాటి ధరలు ఇలా ఉన్నాయి.. రూ.7,500, రూ.2,500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఏడువేల ఐదువందల టికెట్ పై ఇద్దరికి ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా టికెట్లపై ఒకరికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. మండపంలో ఉండి కల్యాణాన్ని వీక్షించే వారి కోసం సుమారు 16,860 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగానే రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 31న శ్రీరాముని సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మూడు రకాల టికెట్లను విక్రయించనున్నారు.

మార్చి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు
బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీరామనవమిని భక్తులు వీక్షించేలా కల్యాణ టికెట్లను మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచారు. అయితే గతంలో ఉత్సవాలను వీక్షించేందుకు 20,005 మంది భక్తులకు అవకాశం కల్పించేవారు. కానీ ఈ ఏడాది 16,860 మందికే టిక్కెట్ల ద్వారా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో కొంతమంది భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు మాత్రం.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే తక్కువ మందిని అనుమతిస్తున్నామని చెబుతున్నారు.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన కార్యక్రమాలైన సీతారాముల కళ్యాణం మార్చి 30న, 31న పుష్కర పట్టాభిషేకం నిర్వహించేందుకు ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వైదిక బృందం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు సైతం ఆలయ అధికారులు ప్రారంభించారు.