Kodali Nani: మహానాడులో తారకరత్న, బాలకృష్ణ ఫొటోలేవి..?
AP: TDP మహానాడుపై, అందులో భాగంగా చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani) తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు (chandrababu) ప్రముఖుల చేత తనను పొగిడించుకోవడం కోసమే దివంగత ntr శత జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు అని విమర్శించారు.
ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేయడానికి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? అని ప్రశ్నించారు కొడాలి.. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. బాలయ్యను అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారు అని నాని ఫైర్ అయ్యారు.
లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారకరత్న ఫొటో ఎందుకు పెట్టలేదు? ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారి ఫొటోలు కూడా ఉండవా? అని ప్రశ్నించారు. 2004, 2009లో వైఎస్సార్ ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటైనా చూపిస్తే దేనికైనా సిద్ధమే అని నాని సవాల్ విసిరారు. 2014లో 450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశాడని విమర్శించారు. డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు 30 లక్షల మందికి పెన్షన్ ఇస్తే.. జగన్ 60 లక్షల మందికి ఇస్తున్నారు అని పేర్కొన్నారు. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తాను అన్నాడు.. ఒక్క విద్యార్ధికి అయినా ల్యాప్ టాప్ అయినా ఇచ్చాడా? అని విమర్శించారు. ఇన్నాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తాను అంటున్నాడంటూ మండిపడ్డారు. ఇదేనా మహానాడు అంటే అని నాని తెదేపా నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.