బచ్చుల అర్జునుడి పాడె మోసిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. దీనిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీగా ఉన్న బచ్చుల ఈ ఏడాది జనవరిలో గుండెపోటుకు గురికావడంతో ఆయన్ని విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన అన్ని అవయవాలు అస్వస్థతకు గురికావడంతో చివరికి కన్నుమూశారు. గత కొంతకాలంగా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా ఉన్న ఆయన.. పార్టీలో చురుగ్గా ఉంటూ వచ్చారు. ఈక్రమంలో బచ్చుల దూరమవడం బాధాకరమని ముఖ్య నాయకులు పేర్కొన్నారు.

ప్రత్యేక వాహనంలో చంద్రబాబు రాక..
బచ్చుల అర్జునుడి మరణవార్త విన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక వాహనంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంకు వచ్చారు. స్థానిక మల్కాపట్నంలో ఉన్న అర్జునుడు స్వగృహానికి పార్టీ నాయకులతో కలిసి వచ్చిన ఆయన బచ్చుల పార్థీవదేహానికి తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం కొద్ది దూరం అర్జునుడి పాడే చంద్రబాబు మోశారు. బందరుకోట వరకు నగర ప్రధాన రహదారుల గుండా సాగిన అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొని తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.

పార్టీలకు అతీతంగా నాయకుల నివాళి..
బచ్చుల అర్జునుడు టీడీపీకి చెందినప్పటికీ.. ఎప్పుడు వివాదాలకు పోకుండా అందరితో సౌమ్యంగా ఉండేవారు. దీంతో పార్టీలకు అతీతంగా ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు నాయకులు, అభిమానులు తరలి వచ్చారు. మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. అర్జునుడి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. మంచి వ్యక్తి దూరమవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇక జిల్లా నలుమూలల నుండి టీడీపీ శ్రేణులు, అభిమానులు బచ్చుల అంతిమయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు. బందరుకోటలోని వ్యవసాయ క్షేత్రంలో అర్జునుడు కుటుంబ పెద్దల సమాధుల పక్కనే దహన సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, నెట్టెం రఘురాం, కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.