Viral News: 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కాతమ్ముడు!

Khartarpur: సోషల్​ మీడియా(Social media) వల్ల అనర్థాలే కాదు, మంచి పనులు కూడా జరుగుతాయనడానికి ఇదొక ఉదాహరణ. ఏదైనా మనం వాడే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. సోషల్​ మీడియా వల్ల చాలామంది తమ కుటుంబాలకు చేరువవుతున్నారు. అలాంటి సంఘటనే ఖర్తార్​ పూర్ కారిడార్​లో జరిగింది. దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కాతమ్ముుడు 75 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. భారత్ లో ఉంటున్న మహేందర్ కౌర్(81)(Mahender Kaur), పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ లో ఉంటున్న షేక్ అబ్దుల్ అజీజ్ (78)(Sheikh Abdul) అక్కాతమ్ముళ్లు ఒకరినొకరు చూసుకుంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. తన తమ్ముడిని చూసి ఆలింగనం చేసుకున్న మహేందర్ కౌర్ అతని చేతిపై ముద్దాడారు. ఈ అరుదైన సంఘటన చూసి ఇరు కుటుంబాల సభ్యులు పాటలు పాడుతూ, వారిపై పూల వర్షం కురిపించారు.

సర్దార్ భజన్ సింగ్ కుటుంబం భారత్ లోని పంజాబ్ లో నివసించేది. అయితే, దేశ విభజన సమయంలో మహేందర్ కౌర్ తండ్రితో భారత్ లోనే ఉండిపోగా, తప్పిపోయిన షేక్ అబ్దుల్ అజీజ్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లిపోయారు. అక్కడే అతను వివాహం చేసుకుని నివసిస్తున్నారు. కానీ, నిత్యం భారత్ లోని తన తల్లిదండ్రులు, సోదరి, బంధువులు కోసం పరితపించేవాడు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు కారణంగా తన వారిని గుర్తించాడు. దీంతో తన తోబుట్టువును కలుసుకునేందుకు వచ్చాడు. 75 సంవత్సరాల తర్వాత కలిసిన అక్కాతమ్ముళ్లను చూసి అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.