Karnataka: ఐదేళ్లూ సిద్ధూనే సీఎం!

Bengaluru: క‌ర్ణాట‌క(karnataka) ముఖ్య‌మంత్రిగా సిద్ధారామ‌య్యే(cm siddaramaiah) ఐదేళ్లు కొన‌సాగుతార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఎంబీ పాటిల్(mb patil) తెలిపారు. సీఎం సీటు స‌గం షేరింగ్ అనేది లేద‌ని స్ప‌ష్టం చేసారు. కాంగ్రెస్ హై క‌మాండ్ చెరో రెండున్న‌రేళ్లు సిద్ధూకి, డీకే శివ‌కుమార్‌కు సీఎం సీటుని ఇచ్చింద‌ని ఎప్ప‌టినుంచో వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దీనిపై పాటిల్ స్పందించారు. “ప‌వ‌ర్ షేరింగ్ ఒప్పందాలేవీ జ‌ర‌గ‌లేదు. మాకైతే ఎలాంటి స‌మాచారం రాలేదు. క‌ర్ణాట‌క సీఎంగా సిద్దూనే ఐదేళ్లు ఉంటారు” అని తెలిపారు. మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

224 సీట్ల‌కు గానూ కాంగ్రెస్ 135 సీట్లు సాధించింది. ఆ త‌ర్వాత నుంచి కర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా హై క‌మాండ్ ఎవ‌రిని నియ‌మిస్తుంది అని దాదాపు వారం పాటు తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఓ వైపు మెజార్టీ సిద్ధారామ‌య్య‌కే సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని ఓటు వేసినా.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నిక‌ల్లో పార్టీ గెల‌వ‌డానికి తీవ్రంగా కృషి చేసిన డీకే శివ‌కుమార్ కూడా సీఎం ప‌ద‌వే కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. దాంతో పార్టీ ఎవ‌ర్నీ నొప్పించకుండా రెండున్నరేళ్లు సీఎం సీటు షేర్ చేసుకోవాల‌ని చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.