AP Elections: అవినాష్‌ను ఓడించేందుకు చెల్లెళ్లు ఏం చేయబోతున్నారు?
AP Elections: APCC చీఫ్ వైఎస్ షర్మిళా రెడ్డి.. (YS Sharmila) ఈసారి లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కడప నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కడపలో YSRCP నుంచి షర్మిళ సోదరుడు అయిన వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) బరిలో దిగనున్నాడు. అక్కడ ఎలాగైనా అవినాష్ రెడ్డిని ఓడించాలని షర్మిళ కంకణం కట్టుకున్నారు. ఇందుకు తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి సహాయం తీసుకోనున్నారు.
అవినాష్ రెడ్డితో అమీతుమీకి సై అంటున్నారు. పులివెందుల నుంచే కార్యచరణకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. సునీత సైతం బలగాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాడేపల్లితో తాడోపేడో తేల్చుకునేందుకు నేతలతో ఈరోజు విజయవాడలో సమావేశం కానున్నారు. జగన్, షర్మిళ మధ్య సయోధ్య కుదుర్చేందుకు సుబ్బారెడ్డి చేసే ప్రయత్నాలు ఫలించేదని తెలుస్తోంది. వైఎస్సార్ వారసత్వం కాంగ్రెస్‌కే సొంతం అని షర్మిళ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సవాళ్లో మొదలైన అన్నాచెల్లెళ్ల పోరు రాజకీయంగా రణరంగాన్ని తలపించనుంది. వీరిద్దరి పోరులో కడపలో వైసీపీ శ్రేణులు కకావికలం అవుతున్నారు.
సార్వత్రిక సమరం సమీపిస్తున్న కొద్దీ కడప జిల్లాలో నూతన రాజకీయ సమీకరణలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సారి పులివెందుల గడ్డపై నుంచే ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి రాజకీయ చర్యలు మొదలవుతున్న పరిస్థితి. వివేకా హత్యతోనే కాదు వైఎస్ కుటుంబం సవాళ్లు మొదలై వివేకా తొలిసారిగా స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబంలో వ్యతిరేక బీజాలు నాటుకున్నాయి. వైఎస్ వివేకా ఓటమి తర్వాత కూడా కుటుంబ సవాళ్లు అధికమై వివేకా హత్యకు దారి తీసాయి. ఈ నేపథ్యాన్నే మొన్న వివేకా వర్ధంతి సభలో షర్మిళ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
వివేకా హత్య రాజకీయ ప్రేరేపితమైన హత్యే అంటూ షర్మిళ పరోక్షంగా అవినాష్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో అవినాష్‌ను అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత వైఎస్ షర్మిళ తన రాజకీయ కార్యచరణకు పదునుపెట్టారని చెప్పాలి. ఈసారి కచ్చితంగా కడప గడ్డపై నుంచే అవినాష్‌కు సవాలు విసిరేందుకు ఇవాళ ఆంధ్రరత్న భవన్‌లో కడప నేతలతో వైఎస్ షర్మిళ భేటీ అవుతున్నారు.