Pawan Kalyan: అందుకే ఎవరు తిట్టినా నాకు సిగ్గు అనిపించదు
Pawan Kalyan: తనను ఎవరు ఎన్ని తిట్టినా కూడా సిగ్గు అనిపించదని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను ఏ రోజైతే జగదాంబ బస్ స్టాండ్‌లో షూటింగ్లో భాగంగా డ్యాన్స్ చేయించారో ఆరోజే తనకున్న సిగ్గు మొత్తం చచ్చిపోయిందని అన్నారు. అందుకే ఎవరు ఎన్ని తిట్టినా కూడా తాను సిగ్గుపడనని తెలిపారు.
“”” నేను సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదు. అప్పటికే మా అన్నయ్య మెగాస్టార్. నాకు అసలు కోరికల, ఆశలు లేవు. ఓసారి మా అన్నయ్య నాతో ఓ మాటన్నారు. అన్నయ్య సంపాదిస్తున్నాడు.. బరువు బాధ్యతలు లేనప్పుడు పని చేయాలని అనిపించదు అన్నాడు. నేను బద్ధకస్తుడిని కాదు అని నిరూపించుకోవడానికే సినిమాల్లోకి వచ్చాను. నాలుగు సినిమాలు చేసి ఆపేద్దామనుకున్నాను. ఖుషి సినిమా తర్వాత నేను సినిమాలు ఆపేసి ఏదైనా ఆశ్రమంలోకి వెళ్లి బతకాలనుకున్నాను. కానీ పరిస్థితులు అలా చెయ్యనివ్వలేదు. భగవంతుడు నేను కోరుకున్న ప్రశాంతతను తప్ప అన్నీ ఇచ్చాడు.
నాకు సినిమాలు ఆనందాన్ని, ప్రశాంతతను ఇవ్వవు. నాకు ప్రశాంతత కావాలి. అదే సమయంలో మా అన్నయ్య పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్నవాళ్లు నన్ను బెదిరించాలని చూసారు. మీ అన్నయ్య పార్టీ పెడతానంటున్నాడు సమాజంలో ప్రశాంతంగా బతకనివ్వం.. ఇంట్లో ఆడవారిపై కామెంట్స్ చేస్తాం అని చెప్పారు. ఆయన ఇంకా పార్టీ పెట్టలేదు కదా పెట్టినప్పుడు చూసుకుందాంలే అన్నాను. నన్ను కూడా బెదిరించాలనుకున్నారు. నా బతుకు ఆల్రెడీ బస్టాండ్ అయిపోయింది ఇక మీరేంటి చేసేది అన్నాను. (Pawan Kalyan)
ALSO READ: వైసీపీ నుంచి వచ్చిన అతనికి పవన్ ఎందుకు సీటు ఇవ్వలేదు?
నాకు ఇష్టమైన రివాల్వర్ని నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న రివాల్వర్ని నేను తిరిగిచ్చేసాను. ఎందుకంటే బతికినంత కాలం బతుకుతాను. ఈమాత్రం దానికి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు. 150 మందితో జనసేన ప్రారంభించాం. ఈరోజు ఆరున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు, వందలాది మంది నాయకులతో జనసేన ఎదిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంతో నలిగాను. ఓ ఆశయం కోసం వచ్చిన నాకు ఓడిపోయినప్పుడు శూన్యం అనిపించింది.
చలి చీమలను నేను పక్కన పెట్టుకోను. నేను అధికారం కోసం రాలేదు. మార్పు కోసం వచ్చాను. అధికారం వస్తే సంతోషం. కానీ అధికారం లేకపోతే ఏమీ చేయలేం అనే పరిస్థితి నాకు లేదు. ఉన్న ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. జనాల గోడు నేను విన్నాను. వైసీపీ పార్టీ పైన కానీ జగన్‌పైన కానీ నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. వారి విధానాలంటే నాకు అసహ్యం. వాళ్లు రౌడీలను, రాజకీయ నాయకులను చూసి ఉండొచ్చు. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి పోరాడితే ఎలా ఉంటుందో వారు చూడలేదు. నన్ను కొట్టే కొద్దీ నా బలం పెరుగుతుంది.
నా అభిమానులు వైసీపీకే ఓటేసారు. సినిమాల్లో నన్ను ఇష్టపడే వారు జగన్‌కు ఓటేసారు. నా అభిమానులు నాకు ఓటర్లు కావాలని నేను కోరుకోను. నేను ఉంటున్న ఈ భూమి ఈ దేశం అందరిదీ. ఎవరి ఇష్టం వారిది. ఏ కలైతే కంటున్నావు అది అవ్వాలి. సమాజంలో మార్పు కావాలంటే మారతారు. మనకు గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీకి గ్రాఫిక్స్ కేవలం రాజకీయాల్లో ఉంటాయి. మనకు సినిమాల్లో ఉంటాయి. నిజానికి నేను సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ వాడను. కానీ వైసీపీ పాపం దొరికిపోయింది. “”” అని తెలిపారు.