Pawan Kalyan: అసలైన అందరివాడు..!
TDP BJP Janasena: ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) NDAలో భాగంగానే ఉంది. అప్పటివరకు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) నేతలు అంత గొప్ప ఇంత గొప్ప అన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. (Chandrababu Naidu) 2019 ఎన్నికల సమయంలో NDA పొత్తు నుంచి బయటికి వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నీచుడు నికృష్ఠుడు అంటూ నోటికొచ్చినట్లు వాగేసారు. చంద్రబాబు నాయుడులో సడెన్‌గా వచ్చిన మార్పును చూసి భారతీయ జనతా పార్టీకి ఒళ్లు మండింది.
దాంతో ఇంకెప్పుడూ ఇలా మాట మార్చి వెన్నుపోటు పొడిచే వారిని నమ్మకూడదు అని అప్పుడే డిసైడ్ అయిపోయింది. కానీ రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఎవ్వరూ శాశ్వత మిత్రులు కారు.. స్నేహితులు అసలు కారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు నుంచి బయటికి వచ్చేసిన చంద్రబాబు నాయుడుకు.. 2019 ఎన్నికల్లో కోలుకోలేని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు దేశం పార్టీకి రాం రాం చెప్పి జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) అధికారం కట్టబెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకు తాను చేసిన తప్పు బాగా తెలిసి వచ్చింది. (TDP BJP Janasena)
అందుకే ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో పొత్తు లేకుండా గెలవడం కుదరదని భావించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ద్వారా భారతీయ జనతా పార్టీతో చేతులు కలపాలని అనుకున్నారు. జనసేనాని సాయం లేకుండా పొత్తు పెట్టుకుందాం అని చంద్రబాబు నాయుడుకి భారతీయ జనతా పార్టీకి అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే 2019 సమయంలో చంద్రబాబు కొట్టిన దెబ్బ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి బాగానే గుర్తుంది.
ALSO READ: Mudragada కు అవమానం.. జగన్ ఏమన్నారు?
దాంతో పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా వ్యవహరించాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడి.. తన అజెండా తెలియజేసి.. తన వ్యూహ రచనను వివరించి పెద్దల మనసులు గెలిచారు. అందుకే ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పవన్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత తాను చంద్రబాబుతో ఉన్నానని పవన్ స్పష్టం చేయడం చకచకా జరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో మాతో భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుందని ఆశిస్తున్నాం అని పవన్ ప్రకటించేసారు.
మెల్లిగా భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి తెలుగు దేశం పార్టీని కలుపుకుందాం అని ఒప్పించారు. ఒప్పించడం వరకే కాదు.. ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశంలో కూడా పెద్ద మనిషిగా వ్యవహరించారు. అందుకే పాపం ఎన్ని సీట్లు తగ్గించినా కూడా సరే.. రెండు సీనియర్ పార్టీలు అని గౌరవించి అడిగిన సీట్లను త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సీట్లు తగ్గించుకున్నందుకు ప్రతిఫలంగా ఏం తీసుకున్నారు అన్న విషయాన్ని పక్కనపెడితే.. తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీల కంటే ఎక్కువగా ఆలోచించి అడుగులు వేస్తూ.. అసలైన అందరివాడు అనిపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.