YS Sunitha Reddy: ఎన్నికలకు ముందు జగన్‌కు మాస్టర్ స్ట్రోక్..!
YS Sunitha Reddy: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి.. తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న సమయంలో ఇప్పటికే తన అన్నకు ఓట్లు వేయొద్దని మొన్న ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించిన సునీత ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆత్మీయ సమ్మేళన సభను ఏర్పాటుచేయనున్నారు. మార్చి 15న తన తండ్రి వివేకానంద రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా కడపలో ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించనున్నారు.
తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును అదే సమ్మలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబానికి ద్రోహం చేసాడు అనే వాదనను సునీత వినిపించనున్నారు. దీంతో వివేకా ఫ్యామిలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అనే మాట ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. తన తండ్రి హత్యపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నారు సునీత. ఈ నేపథ్యంలో YSRCPపై వార్ డిక్లేర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తన అన్న జగన్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు రాజకీయాలే సరైన వేదిక అని భావిస్తున్నారట. వైసీపీ నేతలపై ఎన్నికల యుద్ధంలో ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు.
ALSO READ: YS Sharmila: మా అన్న BJPతో అక్రమ పొత్తులో ఉన్నారు
ముందు పులివెందులలో ఆత్మీయ సమ్మేళనం అనుకున్నారు కానీ ఆ తర్వాత కడపలో అయితే బాగుంటుందని సునీత అభిప్రాయపడ్డారు. సునీతతో పాటు భర్త రాజశేఖర్ రెడ్డి ఈ విషయంలో చాలా బిజీగా ఉన్నారట. సునీత తల్లి సౌభాగ్యమ్మ కడప నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నారు. తండ్రి హత్య, ఆ తర్వాత ఈ కేసు విషయంలో బయటికి వచ్చిన కుట్ర కోణాలు.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఆత్మీయ సమావేశంలో వివరించనున్నారు. బాధితులైన తమ పైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించాలని అనకుంటున్నారు. ఓ వైపు న్యాయ పోరాటం కొనసాగిస్తున్న సునీత.. మరో వైపు జగన్‌ను ఎదుర్కోవాలని చూస్తున్నారట.