Shivaratri: శివ‌రాత్రి రోజున ఇలా చేస్తే పాప రాశి దగ్ధమే..!

Shivaratri: శివ‌రాత్రి అంటే గుడికి వెళ్ల‌డం, అన్నం, నిద్ర మానేసి టీవీల్లో సినిమాల చూడ‌టం.. ఇది రొటీన్ టాస్క్ అయిపోయింది. కానీ శివ‌రాత్రి అనేది సాధ‌కుల‌కు ఎంత గొప్ప రోజో అస‌లు మాట‌ల్లో చెప్ప‌లేం. ప‌ర‌మేశ్వ‌రుడి దివ్య శ‌క్తి అందుబాటులోకి వ‌చ్చే రోజు శివ‌రాత్రి. అస‌లు శివ‌రాత్రి గొప్ప‌త‌నం ఏంటి? శివ‌రాత్రి రోజున చేయాల్సినవి, చేయ‌కూడ‌నివి తెలుసుకుందాం.

కాశీ ఖండంలో చాలా అద్భుత‌మైన క‌థ ఉంది. య‌జ్ఞ ద‌త్తుడు అనే బ్రాహ్మ‌ణుడు ఉండేవాడు. ఆయ‌న వేద‌వేదాంగ పారంగ‌తుడు, స‌ధాచార సంప‌న్నుడు. అయితే.. ఆయ‌న‌కు లేక లేక ఒక కుమారుడు క‌లిగాడు. అత‌నికి గుణ‌నిథి అని పేరు పెట్టాడు. చాలా అంద‌గాడు. చిన్న‌ప్పుడు తండ్రి ఉప‌న‌యం చేయించేసి సంధ్యావ‌ద‌నం చేయించేవాడు. కాక‌పోతే య‌జ్ఞ‌ద‌త్తుడు రాజాస్థానంలో ప‌నిచేసేవాడు. దాంతో ఆయ‌న హ‌డావుడిలో ప‌డిపోయి కుమారుడిని చూసుకోమ‌ని భార్య‌కు చెప్పి వెళ్లిపోతాడు. (Shivaratri)

ఇత‌ను కొంచెం య‌వ్వ‌నంలోకి రాగానే.. ఇవ‌న్నీ వ‌దిలేసి స్నేహితుల‌తో క‌లిసి పేకాట ఆడ‌తాడు. త‌ల్లికి ఆ విష‌యం అర్థ‌మైంది. కానీ తల్లికి బిడ్డ అంటే ఎంతో గారాబం. అలా చేయ‌కురా.. మీ నాన్న‌కు తెలిస్తే బాధ‌ప‌డ‌తాడు అని చెప్పేది. అంతేకానీ నువ్వు చేస్తుంది త‌ప్పు అని మాత్రం చెప్పేది కాదు. నెమ్మ‌దిగా పూజ‌లు అన్నీ మానేసి ఆచారాన్ని వేళాకోళం చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. దాంతో తండ్రికి అనుమానం వ‌స్తుంది. కొన్నాళ్ల‌య్యాక విటుల‌తో సావాసం మొద‌లుపెడ‌తాడు. ఇక వేశ్య‌ల వ‌ద్ద‌కు వెళ్తేందుకు ఇంట్లోని వ‌స్తువుల‌న్నీ వారికి ఇచ్చేవాడు. ఒక‌సారి.. రాజుగారి ఆస్థానంలో య‌జ్ఞ‌ద‌త్తుడు కూర్చుని ఉండ‌గా.. నాట్య‌గ‌త్తె వ‌చ్చి నృత్యం చేస్తుంది.

రాజుగారు ఆ నృత్యం చూస్తూ ఆ అమ్మాయి వేలికి ఉన్న ఉంగ‌రం చూసి ఆశ్చ‌ర్య‌పోతాడు. ఆ ఉంగ‌రం నీ వ‌ద్ద‌కు ఎలా వ‌చ్చింది అని అడిగాడు. నాకు నా ద‌గ్గ‌రికి వచ్చ‌ని విటుడు ఇచ్చాడు అని చెప్పి వెళ్లిపోతుంది. వెంట‌నే రాజుగారు మండిప‌డ్డారు. ఎందుకంటే అది ఆయ‌న ఉంగ‌రం. య‌జ్ఞ‌ద‌త్తుడు ఒక‌సారి అద్భుత‌మైన ప‌ని ఒక‌టి చేస్తే మెచ్చి రాజుగారు ఆ ఉంగరాన్ని ప్రేమ‌తో య‌జ్ఞ‌ద‌త్తుడికి ఇచ్చాడు. ఇప్పుడు అది వేశ్య వ‌ద్ద ఉండ‌టంతో రాజుగారు ప‌ట్ట‌లేని ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ఈ ఉంగ‌రం వేశ్య వ‌ద్ద‌కు ఎలా వెళ్లిందో తెలుసుకునేందుకు య‌జ్ఞ‌ద‌త్తుడు వెంట‌నే ఇంటికి వెళ్లి భార్య‌ను నిల‌దీసాడు.

ఆవిడ వెతికిన‌ట్లు వెతికి నాకు క‌నిపించ‌డంలేద‌ని సాకులు చెప్పేది. ఆమెకు నిజం తెలిసినా దాస్తుంది. య‌జ్ఞ‌ద‌త్తుడికి అనుమానం వ‌చ్చి కుమారుడి గురించి వాక‌బు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. అప్ప‌టికే చేయి దాటిపోయిన కుమారుడి గురించి తెలిసి అత‌ని గుండె ప‌గిలిపోతుంది. దాంతో రాజుగారు గుణ‌నిథిని బంధించి తీసుకుర‌మ్మ‌ని చెప్తాడు. అది తెలిసి గుణ‌నిథి ఊరి నుంచి పారిపోతాడు. ఇంట్లో ఉన్నంత సేపు త‌ల్లి చ‌క్క‌గా వండి పెట్టేది. కానీ ఇప్పుడు బ‌య‌టికి వెళ్లాక తిండి తిప్ప‌లు లేక అల్లాడిపోయాడు.

ALSO READ: Shivaratri: జాగరణ.. ఉపవాసం.. అభిషేకం ఎలా చేయాలి?

ఆ రోజు శివ‌రాత్రి కావ‌డంతో అంతా ప్ర‌సాదాలు ప‌ట్టుకుని ఆల‌యానికి వెళ్తుంటే.. ఒక ప్ర‌సాదం చూసి అత‌నికి నోరూరుతుంది. అది తిందామ‌ని గుడికి వెళ్తాడు. భ‌క్తులు భ‌జ‌న‌లో ఉంటే గుణ‌నాథుడు మాత్రం ప్రసాదంపైనే క‌ళ్లున్నాయి. దాంతో మ‌ధ్య రాత్రి అయ్యే స‌రికి అంద‌రూ నిద్ర‌పోతున్నారు. స‌రే అని ప్ర‌సాదం తిందామ‌నుకుంటాడు. గ‌ర్భాల‌యంలోకి వెళ్తాడు. గ‌ర్భాల‌యంలో అంతా చీక‌టిగా ఉంది. ఒక్క దీపం మాత్ర‌మే వెలుగుతోంది. ఆ దీపం కూడా కొండెక్కేలా ఉండ‌టంతో వ‌త్తిని స‌రిచేసి దీపాన్ని వెలిగిస్తాడు.

ఆ వెలుగులో అత‌నికి శివుడి విగ్ర‌హం క‌నిపిస్తుంది. స‌రే అని అక్క‌డున్న ప్ర‌సాదం తీసుకుని బ‌య‌టికి వ‌స్తుండ‌గా.. అక్క‌డే నిద్రిస్తున్న భ‌క్తులు దొంగ దొంగ అని అరుస్తారు. అత‌ను ప్ర‌సాదం కోసం వ‌స్తే వెండి పాత్ర కోసం వ‌చ్చాడేమో అనుకుని వారంతా అత‌న్ని చిత‌క్కొడ‌తారు. అలా దెబ్బ‌లు భ‌రించ‌లేక అత‌ను చ‌నిపోతాడు. అత‌న్ని తీసుకెళ్ల‌డానికి య‌మ భ‌టులు వ‌స్తారు. అదే స‌మ‌యంలో శివ‌ధూతలు వ‌చ్చి వారిని అడ్డుకుని ఇత‌న్ని య‌మ‌లోకానికి కాదు కైలాసానికి తీసుకెళ్లాలి అని చెప్తారు. దాంతో యమ కింక‌రులు మీకేమ‌న్నా మ‌తిపోయిందా వీడు అన్నీ పాపాలే చేసాడు క‌దా అని ప్ర‌శ్నించారు. అప్పుడు శివ‌ధూత‌లు ఏమ‌న్నారో తెలుసా.. ఇత‌ను ఎన్ని పాపాలు చేసినా స‌రే.. శివ‌రాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ చేసి ప‌ర‌మేశ్వ‌రుడికి దీపంతో అర్చ‌న చేసాడు. లింగాన్ని ద‌ర్శించాడు. ప్ర‌సాదాన్ని చేత్తో ప‌ట్టుకుని మ‌ర‌ణించాడు. కైలాసానికి చేరుకోడానికి ఇంత‌క‌న్నా ఏం కావాలి అని చెప్తారు.

ఇదీ..కాశీ ఖండంలో చెప్పిన క‌థ‌. ఇంత‌కీ ఈ క‌థ సారాంశం ఏంటంటే.. శివ‌రాత్రి రోజున చేసే ప‌నులు ఎంత ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంటాయో, ఎంత‌టి ఫ‌లితాన్ని ఇస్తాయో తెలియ‌జేస్తుంది. ఎంత‌టి పాపాన్ని అయినా ద‌గ్ధం చేసి పారేస్తుంది. కాబ‌ట్టి మీరు రోజూ చేసే పూజ‌ల క‌న్నా శివ‌రాత్రి రోజు నిష్ఠ‌గా ఉప‌వాసం, జాగ‌ర‌ణ‌, అభిషేకం, శివ‌నామ‌స్మ‌ర‌ణం చేస్తే మీ పాపాల‌న్నీ ప‌టాపంచ‌లు అయిపోయిన‌ట్లే..!