Paytm: ఉద్యోగం పోతుందనే భయంతో ఉద్యోగి ఆత్మహత్య
Paytm: పేటీఎం సంస్థలో నెలకొన్న సంక్షోభం ఆ సంస్థ కస్టమర్లకు మాత్రమే కాదు ఆ సంస్థ ఉద్యోగులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఒత్తిడి భరించలేక సంస్థ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సర్వత్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఒక ఉద్యోగి సంస్థలో నెలకొన్న సంక్షోభం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానేమో అనే ఆందోళనతో ఉరివేసుకొని మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఉద్యోగం పోతుందనే భయంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగి గౌరవ్ గుప్తా (40) ఇండోర్‌లోని స్కీమ్ నంబర్ 78లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. నిన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేసిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో పేటీఎం ఉద్యోగుల్లో కూడా కలవరం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పేటీఎంపేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ 35 ఏళ్ల యవకుడు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందనే ఒత్తిడి కారణంగా ఇండోర్‌లో ప్రాథమికంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. (paytm)
ALSO READ: Viral News: మ్యాన్ హోల్‌లో డబ్బే డబ్బు..!
ప్రాథమిక విచారణ ప్రకారం, పేటీఎం సిబ్బంది గౌరవ్ గుప్తా గత కొన్ని రోజులుగా కంపెనీ మూతపడుతుందని, అతను తన ఉద్యోగం కోల్పోతాడు అనే భయంతో ఒత్తిడిలో ఉన్నాడని, ఈ కేసు పై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ తారేష్ కుమార్ సోనీ పీటిఐ వార్తా సంస్థకు తెలిపారు. గుప్తా ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
మార్చి 15 తర్వాత ఏ కస్టమర్ నుండి డిపాజిట్లు క్రెడిట్‌లను స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది. ఈ నెల ప్రారంభంలో, బ్యాంక్ రెగ్యులేటర్ తమ ఖాతాలను మార్చి 15 లోపు ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లతో పాటు వ్యాపారులను కోరింది. అంతకుముందు గడువు ఫిబ్రవరి 29, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 15 రోజులు పొడిగించింది.
శుక్రవారం, రిజర్వ్ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి యూపీఐ హ్యాండిల్ ‘@ పేటీఎం’ని ఉపయోగించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్‌లను 4-5 ఇతర బ్యాంకులకు తరలించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, దీనికి 30 కోట్ల వాలెట్లు 3 కోట్ల బ్యాంక్ కస్టమర్లు ఉన్నారు.
ALSO READ: Viral News: ప్రపంచంలోనే “బెస్ట్ వరస్ట్” హోటల్..!
ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా లావాదేవీలను ప్రాసెస్ చేయడం కోసం పేటీఎం ఆక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్‌లతో భాగస్వామిగా ఉండవచ్చని రాయిటర్స్ సోమవారం ఒక రిపోర్టులో తెలిపింది. మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) రాజీనామా చేశారు. ఆయనతోపాటు పేటీఎం బోర్డు కూడా పూర్తిస్థాయిలో రిస్ట్రక్చర్ చేస్తున్నట్లు కంపెనీ తన ఫైలింగ్ లో తెలిపింది. ఈ నేపథ్యంలో పేటీఎం సంస్థ భవితవ్యం పై సర్వత్ర ఆందోళనలు నెలకొన్నప్పటికీ, నూతన బోర్డు మెంబర్లు మాత్రం కంపెనీ పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.