Karma: మంచివారికే ఎందుకు కష్టాలు?
Karma: చాలా మంది కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలని ఉంటుంది. పోనీ వాడి కర్మకు వాడుపోతాడు అంటుంటారు. అంటే దానర్థం ఏంటి? ఆ కర్మ సిద్ధాంతం మనకు హాని చేసిన వారికి కాకుండా మనకే తిప్పి కొడుతుందా? ఎన్ని పూజలు చేస్తున్నా… ఎన్ని గుళ్లకు వెళ్లినా.. హుండీల్లో డబ్బులు వేసినా ఎందుకు కష్టాలు తీరడంలేదు? కానీ ఉదయం లేవగానే వెధవ పనులు చేసేవాడు మాత్రం చాలా సుఖంగా బతుకుతున్నాడు? ఎందుకిలా? ఇవన్నీ మనకు అర్థంకావాలంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. కర్మ జన్మ ఏంటో అర్థమైతే మన జీవితం కూడా అర్థమైపోతుంది. (Karma)
మన చేత ఏ పని చేయించినా భగవంతుడే చేయిస్తాడు కదా..! మరి భగవంతుడు చేయిస్తున్నప్పుడు ఒకరి చేత పుణ్యం మరొకరి చేత పాపం ఎందుకు చేయిస్తాడు? పూర్వ జన్మలో చేసిన పాపాలను ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటారు కదా. దీని సంగతి తెలుసుకుందా. ఉదాహరణకు ఒక వ్యక్తి మరో నలుగురు వ్యక్తులను దారుణంగా చంపేసాడనుకోండి.. ఆ తర్వాత ఇదే వ్యక్తి మరో జన్మలో ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు. అప్పుడు ఈ వ్యక్తి తన కర్మను పోగొట్టుకోవడానికి పూజలు, హోమాలు వంటివి చేస్తుంటాడు. మరి పూజలు చేసేసి దేవుడికి దక్షిణ వేసేస్తే కర్మఫలం పోతుందంటే.. ఇక దేవుడికి లంచం తీసుకునేవాడికి తేడా ఏంటి? అందుకే దేవుడు ఎప్పుడూ కూడా ఈ కర్మ ఫలం విషయంలో జోక్యం చేసుకోడు. ఇదే కర్మ సిద్ధాంతం.
మనం చేసినదంతా అనుభవించి తీరాల్సిందే. కర్మ విషయంలో జాలి, దయ ఏమీ ఉండవు. అన్నీ ఒక ప్రక్రియలో జరిగిపోతుంటాయి. ప్రకృతి ఆల్రెడీ కోడింగ్ రాసేసింది. ఈ కోడింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ కోడింగ్‌లో ఒక్క శాతం కూడా తప్పు కానీ బగ్ కానీ ఉండదు. మనం ఏ పనైతే చేసామో దానినే తిరిగి అనుభవిస్తాం. శుభం చేసినా అశుభం చేసినా వాటికి కర్మని అనుభవించి తీరాల్సిందే. దీనినే ఫిజిక్స్‌లో ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారమే ఇవన్నీ పని చేస్తాయి.
ఈ కర్మ ఫలాలన్నీ కూడా చిత్రగుప్తుడు చూస్తుంటాడు. చిత్ర గుప్తుడు అంటే ప్రకృతిలో ఉన్న ఓ శక్తి. అంతేకానీ ఒక మనిషి కాదు. ఆ శక్తి ఏం చేస్తుందంటే.. మనం ఏ టైంలో ఎక్కడ ఏ పని చేసినా ఆ డేటాను ఒక దగ్గర దాస్తుంది. ఆ తర్వాత ప్రకృతి దానిని ఉపయోగించి మళ్లీ మనం ఎక్కడ పుట్టాలి? ఎంత అనుభవించాలి? అవన్నీ దాని ప్రకారం సరిచేస్తుంది. ఇదే చిత్రగుప్తుడు చేసే పని. ఈ విషయం చాలా మందికి తెలీక సినిమాల్లో చిత్రగుప్తుడికి టోపీలు పెట్టి చాలా వెటకారంగా అసభ్యకరంగా చూపిస్తుంటారు. అది చాలా తప్పు. ఇది మహా పాపం. చిత్రగుప్తుడు అనేది ప్రకృతిలో ఉన్న ఒక గొప్ప శక్తి. అలాంటి శక్తులను ఎప్పుడూ అవహేళన చేయకూడదు. మరి చిత్రగుప్తుడు అనే శక్తి మనల్ని ఎలా గమనిస్తుంది? ఇది అర్థమైతే జనం ఎందుకు కష్టపడతారో అర్థం అవుతాయి.
మనకి తెలిసినవి
ఆత్మ -1
పంచ భూతాలు – 5
సూర్యచంద్రులు – 2
పగలు, రాత్రి – 2
సూర్యోదయం, సూర్యాస్తమయం – 2
మనకు తెలీనివి
ధర్మం -1
సత్యం -1
వేదాలు – 4
కర్మలో ఉన్న రకాలివే..!
సంచిత కర్మ – ముందు జన్మలో పోగుచేసుకున్నది
ప్రారబ్ధ కర్మ – సంచిత కర్మలోని ఒక భాగం అనుభవించడానికే ఈ జన్మ వస్తుంది
ఆగామి కర్మ – ఈ జన్మలో చేసిన కర్మ ఇప్పుడు, సంచితానికి కలుస్తుంది