Lasya Nandita: లాస్య నందితని వెంటాడిన ప్రమాదాలు
Lasya Nandita: BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. పటాన్‌చెరు ORR వద్ద లాస్య ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బ్యారికేడ్లను ఢీకొంది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న లాస్యను దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. లాస్యతో పాటు కారులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం యశోదకు తరలించారు. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మంత్రి హరీష్ రావు లాస్య నందిత కుటుంబీకులను కలిసి పరామర్శించారు. (Lasya Nandita)
గతంలో వెంటాడిన ప్రమాదాలు
లాస్య నందితకు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదనే చెప్పాలి. ఓసారి లాస్య లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత ఈ నెల 13న నల్గొండలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది.
రెండు ప్రమాదాల్లో ఒకడే డ్రైవర్
ఫిబ్రవరి 13న జరిగిన ప్రమాదంలో లాస్య నందిత కారుకు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తే ఈరోజు జరిగిన ప్రమాదంలో కూడా ఉన్నాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉంది.
ఫిబ్రవరిలోనే తండ్రి మరణం
లాస్య నందిత తండ్రి, దివంగత సీనియర్ నేత సాయన్న కూడా గతేడాది ఫిబ్రవరి నెలలోనే కన్నుమూసారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఇదే నెలలో ఆయన కుమార్తె మరణించడం బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తున్న యువ నేతల్లో లాస్య నందిత ఒకరు. తండ్రి ఆశయాలను పునికి పుచ్చుకుని తండ్రి వేసిన బాటలో నడిచి ప్రజలకు సేవ చేయాలనుకున్న లాస్య చిన్న వయసులోనే ప్రమాదంలో చనిపోవడం బాధాకరం అంటూ రాజకీయ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్‌పై అనుమానాలు
అయితే లాస్య నందితకు రెండు సార్లు జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ ఒకడే. ఈ రెండు ప్రమాదాలు పొరపాటున జరిగాయా లేదా ప్లాన్ ప్రకారం చేయించారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని యశోదకు తరలించారు. అతను కోలుకుంటే తప్ప నిజాలు బయటపడవు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా లాస్య నందిత యాక్సిడెంట్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల కార్లన్నీ కూడా హైవేపై 120 నుంచి 150 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్నాయి. ఈ రాజకీయ నాయకుల వాహనాలు అన్నిటికి కూడా 100 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్స్ పెడితే మంచిదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే మన ప్రియతమ నాయకులను కాపాడుకున్నవాళ్లం అవుతామని అంటున్నారు.
వారం క్రితమే కలిసా: KTR
లాస్య నందితను వారం క్రితమే కలిసి ఎన్నో కీలక అంశాల గురించి చర్చించానని అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఇంతలోనే ఇలా జరగడం దిగ్భ్రాంతికి గురి చేసిందని లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
విధి వేరేలా ఉంది: చంద్రబాబు
లాస్య నందిత మృతిపట్లు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా స్పందించారు. ఆమె తండ్రి సాయన్న చనిపోయిన సరిగ్గా ఏడాదికే లాస్య నందిత చనిపోవడం బాధాకరం అని ఆమె జీవితంలో ఎంతో సాధించాల్సి ఉంది కానీ విధి నిర్ణయం వేరేలా ఉందని అన్నారు.
మంచి కారు ఇవ్వలేదా?
అయితే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు మారుతి ఎక్స్ ఎల్ అని.. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇలాంటి కార్లు ఇస్తే ఎలా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకాస్త మంచి కారు ఇచ్చి ఉంటే ఆమె బతికేవారేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.