Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్.. ప్రాక్టీస్ అదుర్స్
Rishabh Pant: సుమారు 14 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈ మేరకు గాయం తర్వాత తొలిసారిగా ఓ పూర్తి వార్మప్ మ్యాచ్ ఆడాడు. ఇందులో చురుగ్గానే కదిలాడు. అనంతరం వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2024లో పంత్ రీఎంట్రీ ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన టీమిండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్.. రీఎంట్రీకీ సిద్ధమయ్యాడు. ప్రమాదం కారణంగా సుమారు 14 నెలలుగా ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్.. ఎట్టకేలకు మైదానంలోకి దిగాడు. బెంగళూరు సమీపంలోని ఆలూరు క్రికెట్ గ్రౌండ్లో జరిగిన వార్మప్ మ్యాచులో బరిలోకి దిగాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంత్ వెల్లడించాడు.
పంత్ ఎలా కదులుతున్నాడో తెలుసుకునేందుకే ఈ వార్మప్ మ్యాచ్ ఆడినట్లు జాతీయ క్రికెట్ అకాడమీ వర్గాలు తెలిపాయి. పంత్ చాలా రోజులుగా నెట్స్‌లో సాధన చేస్తున్నాడని.. ఈ వార్మప్ మ్యాచ్ మైదానంలోకి అతడు రీఎంట్రీకి కొనసాగింపే అని పేర్కొన్నాయి. ప్రస్తుతం పంత్ ఆటతీరును చూస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌తో తప్పకుండా ఆడతాడని వివరించాయి. (Rishabh Pant)
ALSO READ: IPL 2024: కీలక అప్డేట్ వచ్చేసింది..!
కాగా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్నాడు పంత్. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో పంత్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. మునుపటి స్థాయిలో వేగంగా కదలకపోయినా.. ప్రాక్టీస్‌లో యాక్టివ్ గానే కనిపించాడు. దీంతో మైదానంలో రీఎంట్రీకి సిద్ధమైనట్లు చెప్పకనే చెప్పాడు.
సుమారు మరో నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రిషభ్ పంత్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ ఇప్పటికే వెళ్లడించాడు. దిల్లీ జట్టుకు పంత్ నాయకత్వం వహిస్తాడని.. బ్యాటర్‌గా ఆడతాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “రిషభ్ పంత్ ఐపీఎల్ 2024లో ఆడతాడు. అతడి పాత్ర ఏంటి? వికెట్ కీపింగ్ చేస్తాడా లేడా అన్నది తేలాల్సి ఉంది. కానీ పంత్‌ను అడిగితే తప్పుకుండా వికెట్ కీపింగ్ చేస్తాడు. కానీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది” అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ALSO READ: KKR జట్టులో కీలక మార్పు
రోడ్డు ప్రమాదం కారణంగా గత ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు పంత్. దీంతో డేవిడ్ వార్నర్ దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ఐపీఎల్ 17వ సీజన్ ఎప్పటి నుంచి షురూ అవుతుందనే విషయాన్ని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ఈ మేరకు మార్చి 22 నుంచి కొత్త సీజన్ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు. ఈ వేసవిలో దేశంలో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఐపీఎల్ గురించి అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.