AP Elections: పెరుగుతున్న జ‌గ‌న్ గ్రాఫ్.. ఆల‌స్యం చేస్తే మొద‌టికే మోసం

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని తెలుగు దేశం (Telugu Desam Party), జ‌న‌సేన (Janasena) పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు త‌మ సీట్లను త్యాగం చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. మ‌రోప‌క్క అధికార YSRCP పార్టీ.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కూడా సిద్ధం (Siddham) పేరుతో మ‌రోసారి అధికారాన్ని ద‌క్కించుకోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ బాగానే పెరిగింద‌ని సర్వేలు చెప్తున్నాయి. ఈసారి ఎన్నిక‌ల్లో YSRCP పార్టీకి సీట్లు త‌గ్గుతాయేమో కానీ గెలిచే అవ‌కాశం మాత్రం జ‌గ‌న్‌కే ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

YSRCP నుంచి ఎంత మంది రాజీనామాలు చేసినా కొత్త‌వారు వ‌చ్చినా పార్టీకి న‌ష్టం ఏమీ లేదు. ఈ విష‌యం ముందే అర్థం చేసుకుని రాజీనామా చేసిన వారు మ‌ళ్లీ సొంత గూటికే చేరుతున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ మంగ‌ళ‌గిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డే (Alla Ramakrishna Reddy). జ‌గ‌న్‌తో నా వ‌ల్ల కాదు.. నాకు క‌నీసం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలేదు.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే పార్టీకి పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నాను అని వాగేసారు. ఇక నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ (YS Sharmila) అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తాను అన్నారు. ఆ త‌ర్వాత మంత్రి విజ‌య‌సాయి రెడ్డి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని క‌లిసి చ‌ర్చ‌లు జరిపారు. వారి మ‌ధ్య ఎలాంటి మంత‌నాలు జ‌రిగాయో తెలీదు కానీ మ‌ళ్లీ సొంత గూటికి వెళ్తున్న‌ట్లు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌క‌టించేసారు.

ALSO READ: Pawan Kalyan: యుద్ధానికి సర్వం “సిద్ధం”..!

ఈ మ‌ధ్య‌కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీల నుంచి అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న విష‌యంలో ఆల‌స్యం జ‌ర‌గ‌డ‌మే. ఎక్క‌డ ముందే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించేస్తే ఎక్క‌డ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న చ‌ర్య‌ల‌తో వారిని కొనేయ‌డం.. వారంత‌ట వారే రాజీనామాలు చేసేలా చేయడం వంటివి చేస్తాడోన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..(Pawan Kalyan) తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి (Chandrababu Naidu) ముందే అభ్య‌ర్ధుల‌ను, పోటీ చేయ‌నున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌క‌టించ‌కూడ‌దని స‌ల‌హా ఇచ్చారు. అదే ఇప్పుడు జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీల కొంప ముంచేలా ఉంది. (AP Elections)

జగన్ మోహ‌న్ రెడ్డిని క్యాజువల్‌గా దింపేద్దాం అనుకుంటే అది అంత ఈజీ కాదు. అధికారంలోకి రావడం నల్లేరు మీద నడక కాదు. ఇంకా అభ్య‌ర్ధుల విష‌యంలో ఆలస్యం చేసినా, ఏమరపాటుగా ఉన్నా మొదటికే మోసం వ‌చ్చేలా ఉంది. ఇది జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీలు గ్ర‌హించ‌లేక‌ పోతుతున్నాయి. నిజంగానే ఒక శాతం ఓటున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతోందో లేక పొత్తును ముందు వెళ్ల‌నివ్వ‌డంలేదో తెలీడంలేదు కానీ ఆల‌స్యం వ‌ల్ల మాత్రం న‌ష్టం తెలుగు దేశం, జ‌న‌సేన‌కే. రోజులు వృథా అయిపోతున్నాయి. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ద్ద ఉన్న ప‌లుకుబ‌డి, డ‌బ్బు ఉన్న వ్య‌క్తి. అందులోనూ అధికారంలో ఉన్నారు. ఆయ‌న్ని ఓడించ‌డం క‌ష్టం, అసాధ్యం కాక‌పోయినా చాలా నేర్ప‌రిత‌నం, నైపుణ్యం, సృజ‌నాత్మ‌కంగానే గ‌ద్దె దించ‌గ‌లుగుతారే త‌ప్ప ఇప్పుడు సులువుగా తీసుకుంటే ఆయ‌న్ను ఓడించ‌డం అసాధ్యం.

ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. పొత్తు పెట్టేసుకున్నాం క‌దా.. ఇరు పార్టీ అధ్య‌క్షులు క‌లిసే ఉన్నాం క‌దా.. ఇక జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఓడించ‌డం న‌ల్లేరు మీద న‌డ‌కే అనుకుంటే పొర‌పాటే. ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఇబ్బంది ప‌డాల్సిందే. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డే స‌మ‌యంలో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించేస్తే అప్పుడు టికెట్ రాని అభ్య‌ర్ధుల నుంచి మ‌న‌స్ప‌ర్ధ‌లు, రాజీనామాల గొడ‌వ ఎక్కువగా ఉంటుంది. దీని వ‌ల్ల ఇరు పార్టీల్లో క‌న్‌ఫ్యూజన్ పెరుగుతుంది. ఈ విష‌యాల‌న్నీ జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీ కూర్చుని చ‌ర్చించుకుంటే మంచిది అని రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు.