Pawan Kalyan: యుద్ధానికి సర్వం “సిద్ధం”..!
Pawan Kalyan: రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటైన కూటమికి కచ్చితంగా విజయం దక్కుతుందని గెలుపు తెలుగు దేశం, జనసేన పార్టీల కూటమిదే అని ధీమా వ్యక్తం చేసారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల ప్రక్రియలో జనసేన వేస్తున్న ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే ఉంటుందని చెప్తూ కూటమి అభ్యర్ధులు గెలిచే దిశగా క్షేత్ర స్థాయి వరకూ పని చేయాలని పిలుపునిచ్చారు. ఓట్లు సక్రమంగా బదిలీ అయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేసారు. ఈరోజు మధ్యాహ్నం రాజమండ్రిలో పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, ఆనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలను తెలియజేసారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ గత అయిదేళ్ల రాజకీయ ప్రయాణం ఎలా సాగిందో అందరూ చూసారు. కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు ఇంత స్థిరంగా నిలబడటానికి పోరాడే ధైర్యం మనలో ఉండటానికి జనసేనకు ఉన్న సైద్ధాంతిక బలమే కారణం. పార్టీకి త్వరలో 11వ ఆవిర్భావ దినోత్సవం రాబోతోంది. ప్రజా జీవితంలోకి వచ్చిన నాయకుడిగా నాకు 15 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నేను వెనకడుగు వేయలేదు. కేవలం ఒక ఎన్నిక కోసం వచ్చిన పార్టీ కాదు జనసేన. అపజయం ఎదురైనా బలంగా నిలబడి ప్రజల కోసం నిలిచాం. ఇది ఒక పరీక్ష లాంటిది. ఇందులో మనం గెలిచాం.
అబ్రహం లింకన్ ఓ సందర్భంలో చెప్పారు.. ఒక చెట్టు కొట్టడానికి ఆరు గంటల సమయం ఇస్తే ఐదున్నర గంటలు గొడ్డలి పదును పెట్టడానికే వెచ్చిస్తాను అన్నారు. మనం కూడా గత నాలుగున్నరేళ్ల పాటు వ్యూహాలను, మన నాయకులను, క్యాడర్‌ను పదునుపెట్టుకున్నాం. ఇక యుద్ధానికి సర్వం సిద్ధం అయ్యాం. మనం ఏమిటో చూపిద్దాం. ఇక మనకు ఉన్నది 50రోజులు మాత్రమే. (Pawan Kalyan)
ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుంది
పొత్తులో భాగంగా మనకు దక్కే స్థానాల్లో మన భాగస్వామ్య పక్షం వైపు నుంచి కూడా ఓట్లు పక్కాగా దక్కించుకోవడం, మన భాగస్వామి పోటీ చేసిన చోట మన ఓటు బదిలీ అయ్యేలా చూసుకోవడం కీలకం. ఈ ప్రక్రియలో మనకు ఈ ఎన్నికల్లో స్థానాల దక్కడమే కాదు.. తదుపరి దశల్లో స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో, సహకార సంఘాల్లో మనకు మూడో వంతు స్థానాలు దక్కుతాయి. పార్టీ కోసం చిత్త శుద్ధితో నిలిచిన ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వడం బాధ్యతగా తీసుకుంటాం.
తెలుగు దేశం పార్టీతో పొత్తు అనేది ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరం. అటువంటి చారిత్రాత్మకమైన పొత్తును ప్రకటించింది రాజమండ్రిలోనే. ఈ ప్రాంతంలో మన పార్టీ ముద్ర కచ్చితంగా ఉండాలి. పార్టీలో అందరి భావనా అదే. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మన పార్టీకి మంచి సంఖ్యలో ఓట్లు లభించాయి. ఈ స్థానం నుంచి మనం పోటీ చేస్తాం. అక్కడ నుంచి తెలుగు దేశం గెలిచిందని చెప్తున్నారు. ఆ పార్టీ నాయకులతో మాట్లాడదాం. కందుల దుర్గేష్‌ను వదులుకోం.
ఎలక్షనీరింగ్ చేయడం చాలా కీలకం
జనసేన ఒంటరిగా పోటీ చేయవచ్చు కదా.. ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి తీసుకోవాలి అని సూచనలతో కూడిన లేఖలు వస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే మనం 40 స్థానాల్లో గెలుస్తాం. ఆ బలం ఉంది. మనం పోటీ చేసి గెలిచేందుకు ఎలక్షనీరింగ్ చాలా కీలకం. మనకు రావాల్సిన ప్రతి ఓటునీ పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లి.. మన గుర్తు మీద పడేలా చేయాలి. పూర్తి సమర్థతతో ఎలక్షనీరింగ్ చేసే అభ్యర్ధులు కూడా ఉండాలి. మనం ఎక్కువ సంఖ్యలో స్థానాలు డిమాండ్ చేసి తీసుకొని.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే YSRCPకి లాభం కలుగుతుంది.
ప్రజలకు YSRCP అరాచకాలు వివరించాలి
గత ఎన్నికల ముందు జగన్ ఈ జిల్లాలో పాదయాత్ర చేసారు. కాపుల ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలోనే కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఈడబ్యూఎస్ కోటాలో కాపులకు ఉన్న 5% రిజర్వేషన్ కూడా తొలగించారు. దీని వల్ల కాపులు విద్యాపరంగా, ఇతర అవకాశాల పరంగా వెనుకబడే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలి. బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరుతో ఉన్న పథకాలు రద్దు చేసారు. ఆ మహానీయుడు పేరుతో ఉన్న పథకాలను తన పేరు పెట్టుకున్న జగన్ గురించి అతని అరాచకాల గురించి ప్రజలకు తెలియజేప్పే బాధ్యత మనమే తీసుకోవాలి. అని జనసేనాని సమావేశంలో వెల్లడించారు.