Ravichandran Ashwin: అశ్విన్ అనూహ్య నిర్ణయం వెనకున్న కారణం ఏంటి?
Ravichandran Ashwin: రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మూడో టెస్ట్ నుంచి మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు.
టీమిండియాకు షాక్ తగిలింది. మూడో టెస్ట్ మధ్యలో నుంచి టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ మూడో టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు BCCI ప్రకటించింది. క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యుల క్షేమం తమకు ఎంతో ముఖ్యమని, క్లిష్ట పరిస్థితుల్లో ఇండియన్ టీమ్‌తో పాటు బీసీసీఐకూడా అతడికి అండగా ఉంటుందని తెలిపింది.
అశ్విన్ ప్రైవసీకి భంగం కలగకుండా అభిమానులు సంయమనం పాటించాలని బోర్డ్ ప్రకటించింది. ఈ కఠిన పరిస్థితుల్లో అశ్విన్‌కు అన్ని విధాలుగా సాయం అందించేందుకు బోర్డ్ సిద్ధంగా ఉందని ప్రకటించింది. తన తల్లికి సీరియస్‌గా ఉండటంతోనే అశ్విన్ చెన్నై వెళ్లినట్లు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. (Ravichandran Ashwin)
అయితే, టెస్ట్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ దూరమవ్వడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మూడో రోజు నుంచి అతడు అందుబాటులో ఉండకపోవడంతో ఇంగ్లండ్ జోరును టీమిండియా ఎలా అడ్డుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్ కోట్ టెస్ట్‌లో రెండో రోజు క్రాలీ వికెట్ తీసిన అశ్విన్ ఐదు వందల క్లబ్లో అడుగుపెట్టాడు. అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రను సృష్టించాడు. . ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లోనూ 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్ జోడి ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, రాజ్‌కోట్ వేదికగా జరుగుతోన్న ఈ మూడో టెస్ట్‌లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 445 పరుగులు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 131, రవీంద్ర జడేజా 112 పరుగులతో టీమిండియాను ఆదుకున్నారు. రాజ్ కోట్ టెస్ట్‌తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులతో రాణించాడు.. ఈ టెస్ట్‌లో రెండో రోజు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్ వన్డే తరహాలో చెలరేగి ఆడుతున్నాడు. 118 బాల్స్‌లోనే 21 ఫోర్లు, రెండు సిక్సర్లతో 133 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు రూట్ 9 పరుగులతో ఆడుతోన్నాడు.
మరో మూడు రోజులు ఆట మిగిలే ఉన్న నేపథ్యంలో అశ్విన్ దూరం కావడంతో మూడో టెస్ట్‌లో రిజల్ట్‌పై ఆసక్తి ఏర్పడింది. కుల్దీప్, జడేజా కలిసి ఇంగ్లండ్ జోరుకు ఏ మాత్రం అడ్డుకట్ట వేస్తారన్నది చూడాల్సిందే. రాజ్ కోట్ తర్వాత జరుగనున్న మిగిలిన టెస్ట్‌లకు అశ్విన్ అందుబాటులో ఉండటం కూడా అనుమానమేనని తెలుస్తోంది.
ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లి ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. గాయాలతో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్యలోనే సిరీస్ నుంచి వైదొలిగారు. తాజాగా అశ్విన్ కూడా దూరమవ్వడంతో ఇండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా వైజాగ్ టెస్ట్‌ను టీమిండియా సొంతం చేసుకున్నది.