YS Jagan Mohan Reddy: ఆ నిర్మాత నుంచి బెదిరింపులు?
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ నిర్మాత నుంచి బెదిరింపులు వచ్చాయట. ఆ నిర్మాత ఎవరో కాదు.. యాత్ర 2 (Yatra 2) సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శివ మేక. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) కూడా సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే వీరిద్దరూ జగన్ మోహన్ రెడ్డిని బెదిరించారట. ఈ మాట ఎవరో కాదు.. నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.
శంఖారావం పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party). ఒక్కో నియోజకవర్గంలో నారా లోకేష్ స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి పర్యటిస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యాత్ర 2 సినిమా గురించి ప్రస్తావించారు.
యాత్ర 2 ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసని ఓపెనింగ్ డే రోజే ప్రజలు సినిమాను తిరస్కరించారని అన్నారు. సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు తగ్గట్టు లాభాలు రాకపోవడంతో నిర్మాత జగన్ మోహన్ రెడ్డిని బెదిరించారని అన్నారు. దానికి జగన్.. సినిమా ఆడకపోతే నేనేం చేయగలను అంటూ వారిని తిట్టి పంపించేసారని తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించకపోతే అంతిమ యాత్ర అనే సినిమాను తీయాల్సి వస్తుందని నిర్మాతలు జగన్‌ను బెదిరించినట్లు లోకేష్ వెల్లడించారు.
“” యాత్ర 2 నిర్మాతలు జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ లాభాలు వస్తాయనుకున్నారు కానీ రాలేదు. దాంతో వారు జగన్‌కు తమ బాధను వ్యక్తం చేసారు. కానీ జగన్ నాకు సంబంధం లేదు అని వారిని గెంటేసారు. అప్పుడు వారికి కోపంతో నష్ట పరిహారం ఇవ్వకపోతే అంతిమయాత్ర అనే సినిమా తీస్తాం అని జగన్‌ను బెదిరించారు. అంతటితో ఆగలేదు. అంతిమ యాత్ర పోస్టర్‌ను తీసుకుని జగన్ వద్దకు వెళ్లారు. ఎన్నికల సమయం కావడంతో జగన్ కాస్త భయపడ్డారు. అందుకే హార్స్లీ హిల్స్‌లో నిర్మాతలకు జగన్ భూములు కేటాయించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు ఇలా ఉన్నాయి మరి “” అని నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు.
జగన్ మోహన్ రెడ్డికి ఇడుపుల పాయలో వందల ఎకరాలు ఉన్నాయని.. వాటిలో ఓ రెండు ఎకరాలు నిర్మాతలకు ఇచ్చినా బాగుండేదని సెటైర్ వేసారు. కానీ జగన్ మాత్రం పబ్లిక్ ప్రాపర్టీ అయిన హార్స్లీ హిల్స్ భూములను నిర్మాతలకు ఇవ్వడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. అయితే లోకేష్ చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజం ఎంతుందో తెలీదు కానీ మహి వి రాఘవ్‌కు జగన్ 2.5 ఎకరాల స్థలాన్ని కానుకగా ఇచ్చిన విషయం మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని మహి వి రాఘవ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. రాఘవ్‌కి జగన్ నుంచి రూ.25 కోట్లు అందాయని ఓ పత్రికలో పదే పదే వార్త పబ్లిష్ అవుతుండడంతో వెంటనే ఆయన స్పందించి అందులో నిజం లేదని తనకు అందింది 2.5 ఎకరాల భూమి మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఆ భూమిని తన స్వస్థలంలో ప్రొడక్షన్ హౌస్ నిర్మించి టాలీవుడ్ అభివృద్ధి కోసమే వినియోగించనున్నానని తెలిపారు.