Ishan Kishan: టార్గెట్ ఇషాన్‌ కిషన్‌..!

Ishan Kishan: రంజీ ట్రోఫీలు ఆడకుండా IPL 2024 కోసం సన్నదమవుతున్న భారత ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌ను లెక్కచేయకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైన ఆటగాళ్లకు నోటిసులు ఇచ్చేందుకు కూడా బోర్డు సిద్దమైనట్లు సమాచారం.

అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) తప్ప మరే ఇతర మ్యాచ్‌లు ఆడబోమని కూర్చున్న పలువురు భారత క్రికెటర్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకిచ్చింది. రెస్ట్‌ తీసుకుంటామని చెప్పి జట్టు నుంచి తప్పుకున్న క్రికెటర్లంతా తప్పకుండా దేశవాళీ క్రికెట్‌ ఆడాలని, నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం జాతీయ జట్టుతో ఉన్న ఆటగాళ్లు, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) లో రిహాబిటేషన్‌లో ఉన్న క్రికెటర్లు మినహా మిగిలినవారంతా నెక్స్ట్‌ రౌండ్‌ రంజీ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని హుకుం జారీ చేసింది.

టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​ ప్రవర్తన పట్ల BCCI అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ కనీసం రంజీల్లో కూడా ఆడకుండా, ఏకంగా ఐపీఎల్​ కోసం సన్నద్దమవడం బోర్డు మేనేజ్​మెంట్​కు నచ్చలేదని సమాచారం. ఇషాన్​తో పాటు దేశవాళీలో రెడ్​బాల్ క్రికెట్ (టెస్టు) ఆడేందుకు నిరాకరిస్తున్న ప్లేయర్లకు నోటీసులు ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యిందట. కిషన్‌తో పాటు బరోడాలో ట్రైనింగ్‌ అవుతున్న హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చాహర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లు కూడా దేశవాళీలో తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సిందే.

గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లిన భారత జట్టులో ఉన్న ఇషాన్‌ కిషన్‌.. వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందే వ్యక్తిగత కారణాలు చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఇషాన్‌.. జాతీయ జట్టుకు దూరమైనా తిరిగి టీమ్‌లోకి రావాలంటే కచ్చితంగా దేశవాళీలో ఆడాల్సిందేనని టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఇదివరకే పలుమార్లు అతడికి సూచించాడు. కానీ ఇషాన్‌ మాత్రం ద్రావిడ్‌ మాటలను పెడచెవిన పెట్టాడు. ద్రావిడ్‌ ఎన్నిసార్లు చెప్పినా ఇషాన్‌ మాత్రం అసలు తనకు రంజీలతో సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పుడు బీసీసీఐ ఆదేశాలతో ఇషాన్‌ తప్పనిసరిగా రంజీలు ఆడాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న రంజీలో ఝార్ఖండ్​కు ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. ఫిబ్రవరి 16నుంచి రాజస్థాన్​తో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇషాన్ ఇప్పటికీ తన పేరు జట్టుతో నమోదు చేసుకోలేదు. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఇషాన్ కిషన్‌కు పడటం లేదనే ప్రచారం జరుగుతోంది. తనకు బదులు ఇషాన్ కిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై బోర్డు ఆగ్రహంగా ఉన్నట్లు సమచారం. చూడాలీ మ‌రి ఇప్పుడైన ఇషాన్ రంజీల్లో ఆడి టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాడో లేదో..

ఇక హార్ధిక్‌ విషయానికొస్తే.. గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరాలని పలుమార్లు సూచించినా అతడు మాత్రం బరోడాలో ట్రైన్‌ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్‌.. మరో నెల వరకూ పూర్థిస్థాయిలో సిద్ధమయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడు. అయితే బీసీసీఐ ఆదేశాలతో అతడు కూడా దేశవాళీలో పాల్గొనాల్సిందే.