Viral News: రెస్యూమ్ చూసి జడుసుకున్న హెచ్ఆర్..!
Viral News: ఓ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేయాలంటే మనకు ఆ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉండాలి. దాంతో పాటు ఓ చక్కని రెస్యూమ్ని (Resume) కూడా తయారుచేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రెస్యూమ్‌లను చూసే కంపెనీ నుంచి హెచ్ఆర్లు ఫోన్లు చేస్తుంటారు. కొందరు ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని తమ రెస్యూమ్‌లను ఎంతో క్రియేటివిటీతో తయారుచేసుకుంటూ ఉంటారు. అయితే ఆ క్రియేటివిటీ మితిమీరితేనే సమస్యలు వస్తాయి. అమెజాన్‌కు (Amazon) చెందిన ఓ హెచ్ఆర్కి ఆ క్రియేటివిటీ వల్ల షాక్‌కు గురైంది. ఇంతకీ అంతగా భయపడేంతగా ఆ రెస్యూమ్‌లో ఏముంది అనుకుంటున్నారా?
లిండ్సే అనే మహిళ అమెజాన్‌లో చీఫ్ హెచ్ఆర్గా పనిచేస్తోంది. ఆమె తన 20 ఏళ్ల కెరీర్లో కొన్ని లక్షల రెస్యూమ్‌లు చూసింది. దాదాపు 10 వేల మందిని హైర్ చేసుకుంది. అయితే నిన్న ఉదయం తన వద్దకు వచ్చిన రెస్యూమ్‌లు చూస్తుంటే ఒక క్యాండిడేట్ రెస్యూమ్ కనిపించింది. ఆ రెస్యూమ్‌లో మొదటి రెండు పేజీలు బాగానే ఉన్నాయి. రెస్యూమ్ చివరి పేజీలో ఆ క్యాండిడేట్ తన ఫోటోని అతికించాడట. అది మామూలు ఫోటో కూడా కాదు. అతని చేతిలో గన్ను ఉంది. గన్నుతో దిగిన ఫోటోను రెస్యూమ్‌లో అతికించి పంపించాడట. అది చూడగానే లిండ్సేకి ఒళ్లు గగుర్పొడిచింది.
అసలు ఇలాంటి రెస్యూమ్‌లు ఎవరైనా పంపిస్తారా అని లిండ్సేకి ఒళ్లుమండిపోయిందట. తన స్థానంలో మరో హెచ్ఆర్ ఉండి ఉంటే వారు కచ్చితంగా ఆ క్యాండిడేట్పై చర్యలు తీసుకునేవారని తెలిపారు. “” అసలు ఉద్యోగాల కోసం వెతుకున్న అభ్యర్ధులు ఏమని ఆలోచిస్తున్నారో అర్థం కావడంలేదు. ఇలాంటి ఫోటో షూట్లు రెస్యూమ్‌లో ఎలా పెడతారు? ఒకవేళ రియల్ ఎస్టేట్ లేదా మోడలింగ్ వంటి కెరీర్లు ఎంచుకోవాలనుకుంటే అప్పుడు ఇలాంటి ఫోటోలు పెట్టుకోవడానికి బాగుంటాయి. పైగా ఇలాంటి ఫోటోలు పెట్టి కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి అనుకోవడం పొరపాటు. అతనికి ఎంత ధైర్యం ఉంటే రెస్యూమ్‌ను పంపుతాడు? అయినా ఎవరు ఫోన్ చేస్తారు ఇలాంటి వారికి? నాకు తెలిసి ఇలా కావాలనే చేస్తుంటారు. వారికి ఉద్యోగం అవసరం ఉండదు. ఏదో బెదిరించడానికి చిల్లర పనులు చేయడానికి ఇలాంటివి చేస్తుంటారు అనిపిస్తోంది “” అని లిండ్సే మీడియా ద్వారా వెల్లడించారు.