Anupama: భయంతో కొన్ని సినిమాలు వదులుకున్నా
Hyderabad: త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో వచ్చిన అ ఆ(A Aa) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). ఆ సినిమా సక్సెస్తో వరుసగా మలయాళం, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. గత సంవత్సరం వరుసగా నాలుగు తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది అనుపమ. కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్(18 Pages) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అనుపమ బటర్ ఫ్లై సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రస్తుతం అనుపమ సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు సినిమా సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో పాటు ఓ తమిళ సినిమా చేస్తోంది. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు, తను కోల్పోయిన పాత్రల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. ‘2021 వరకు కథలు, పాత్రల ఎంపికపై నేను గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను. ఆ సమయంలో ‘ఫ్రీడమ్ @ మిడ్నైట్’ అనే ఓ షార్ట్ ఫిలిం చేశాను. ఆ సినిమాను అందరూ ఆదరించారు. ఆ సినిమా నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నాలో ఉన్న చాలా భయాలు, అపోహలను పోగొట్టింది. కొన్ని పాత్రలు చేస్తే జనాలు, ప్రేక్షకులు, అభిమానులు ఏమనుకుంటారో అనుకునేదాన్ని. అలాంటి భయంతోనే చాలా పాత్రలు వదులుకున్నాను. కానీ ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు మనం చేసే పాత్ర నచ్చితే ఆదరిస్తారు అనే నమ్మకం కలిగింది. ఇకపై ప్రతి సినిమాకి ప్రతి కొత్త పాత్రతో రావాలని, నాకు నచ్చిన పాత్రలు చేయాలని అనుకున్నాను. ఒక చిన్న సీన్ అయినా సరే నాకు నచ్చితే చేయడానికి నేను రెడీ. అలాగే అన్ని భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నాను’ అంటూ మనసులో మాటలు పంచుకుంది ఈ బ్యూటీ.