World Parkinson’s Day: ఈ వ్యాధికి చికిత్స ఉందా?

Hyderabad: పార్కిన్స‌న్స్ వ్యాధి (Parkinsons disease).. ఇదొక న్యూరో డీజెన‌రేటివ్ డిజార్డ‌ర్. అంటే న‌రాల్లో అస‌మ‌తుల్య రుగ్మ‌తులు ఎదురైన‌ప్పుడు వ‌చ్చే వ్యాధి. ఈరోజు ప్ర‌పంచ పార్కిన్స‌న్స్ వ్యాధి దినోత్స‌వం (World Parkinsons Disease). అస‌లు ఇది ఎందుకు వ‌స్తుంది? ఎవ‌రికి వ‌స్తుంది? వ‌చ్చినా త‌గ్గుతుందా? ఇలాంటివాటి గురించి ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

పార్కిన్స‌న్స్ వ్యాధితో బాధ‌ప‌డేవారికి ఒక్క‌సారిగా మూర్ఛ వ‌చ్చిన‌ట్లు అవుతుంది. అయితే ఈ వ్యాధి ఉన్న‌వారికి మోట‌ర్ ల‌క్ష‌ణాలు, నాన్ మోట‌ర్ ల‌క్ష‌ణాలు అని రెండు ర‌కాలుగా ఉంటాయి. మోట‌ర్ ల‌క్ష‌ణాలు అంటే సాధార‌ణంగా శ‌రీరంలోని అవ‌య‌వాలు క‌దిలే తీరులో మార్పులు వ‌స్తాయి. నాన్ మోట‌ర్ ల‌క్ష‌ణాలు అంటే శ‌రీరంలోని అన్ని అవయ‌వాల‌పై ప్ర‌భావం చూపుతుంది. మోట‌ర్ ల‌క్ష‌ణాలను సులువుగా గుర్తించి వారికి స‌రైన చికిత్స అందిస్తే త్వ‌రగా కోలుకుంటారు. నాన్ మోట‌ర్ ల‌క్ష‌ణాలు ఉంటే శ‌రీరం లోప‌ల ఏం జ‌రుగుతుందో స‌రిగ్గా గుర్తించ‌లేం. ఈ వ్యాధి గురించి మొద‌టిసారి 1817లో జేమ్స్ పార్కిన్స‌న్ అనే డాక్ట‌ర్ ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డంతో ఈ వ్యాధికి కూడా ఆయ‌న పేరే పెట్టారు.

ఈ వ్యాధి ఎక్కువ‌గా కాస్త వ‌య‌సు పైబ‌డిన‌వారిలో క‌నిపిస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిస్స‌త్తువ‌, కండ‌రాలు ప‌ట్టేసిన‌ట్లు ఉండటం, మూర్ఛ వ‌చ్చిన‌ట్లు శ‌రీరంలో షాక్స్ రావ‌డం, మ‌ల‌బ‌ద్ధ‌కం (Constipation), నిద్ర‌లేమి, వాస‌న తెలీక‌పోవ‌డం, మూడ్ స్వింగ్స్.. ఇవ‌న్నీ పార్కిన్స‌న్స్ వ్యాధి ప్ర‌ధాన ల‌క్ష‌ణాలుగా చెప్ప‌చ్చు. వ్యాధి ఉంద‌ని నిర్ధార‌ణ అయిన‌ప్పుడు వైద్యులు థెరపీ స‌జెస్ట్ చేస్తారు. 60 ఏళ్ల క్రితం ఈ వ్యాధి వ‌చ్చిన‌వారికి కేవ‌లం మందులే చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డేవి. కాలం మారుతున్న కొద్దీ మందులే కాకుండా ఇత‌ర ప్ర‌త్యామ్నాయాలు కూడా వ‌చ్చేసాయి.