Obesity: పిల్లల్లో ఊబకాయం.. కారణాలు ఇవే
స్మార్ట్‌యుగంలో సాంకేతికత వాడకం పెరిగి శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఊబకాయం(ఒబేసిటీ). మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆందోళన, పని ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయ సమస్య ఎదురవ్వడానికి ఆహారపు అలవాట్లే ప్రధానమని చెబుతున్నారు. ఈ ఏడాది ప్రపంచ స్థూలకాయ దినోత్సవం(మార్చి 04) సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఇచ్చిన నివేదిక ప్రకారం 1975 నంచి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ సమస్య పెద్దల్లోనే కాదు, చిన్నారులలోనూ ఎక్కువ అవుతోంది. WHO ప్రకారం, 2020లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 39 మిలియన్ల పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువుతో బాధపడే పిల్లల దేశాల జాబితాలో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది. ఇటీవల చేపట్టిన అధ్యయనం ప్రకారం దేశంలో 14.4 మిలియన్ల పిల్లలు అధికబరువుతో ఉన్నట్లు తేలింది. పిల్లల్లో ఊబకాయం కారణంగా గుండె సమస్యలు, నిద్రపోయినప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కీళ్ల సమస్యలు, డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా, చిన్నవయస్సులో ఈ సమస్య ఎదురైతే వాళ్లు పెద్దైన తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పిల్లల్లో ఊబకాయం రావడానికి గల కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..
- ఈతరం పిల్లలకు తగినంత శారీరక శ్రమ లేకపోవటం ఊబకాయానికి ప్రధాన కారణం అవుతోంది. పిల్లలు బయటకెళ్లి ఆడుకోవడం, నలుగురితో కలవడం వంటివి ఈమధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోయింది. కరోనా తర్వాత మొబైల్ వాడకం, టీవీ చూడటం బాగా పెరిగిపోయింది. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు కూడా చిన్నారులలో ఊబకాయానికి కారణం అవుతాయి. పిల్లల్లో ఊబకాయానికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారం. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పోషక విలువలు లేని ఆహారం, కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు అధికంగా పెరిగిపోతున్నారు. కొవ్వు, కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం పిల్లల్లో స్థూలకాయానికి ప్రధాన కారణం.
- పిజ్జా అంటే చాలు ఎగిరి గంతేస్తారు పిల్లలు. వాళ్ల ఫేవరెట్ ఫుడ్ టాప్ లిస్ట్‌లో ఉంటుంది. దీన్ని చాలా రకాల కూరగాయలు, చికెన్, మటన్ టాపింగ్స్, గోధుమ పిండి బేస్‌తో తయారు చేస్తారు. ఇది చూడటానికి కలర్ఫుల్గా కనిపించినా, పిజ్జా తయారు చేయడానికి వాడే చీజ్ కారణంగా బరువు తర్వగా పెరుగుతారు. అదేవిధంగా బర్గర్లు, హాట్ డాగ్స్, ప్యాటీస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లలకు ఇవి తినే అలవాటు ఉంటే.. వెంటనే మానిపించాలి.
- పిల్లల ఫేవరట్ ఫుడ్స్‌లో ఆలూ చిప్స్ కూడా ఒకటి. కానీ, ఈ చిప్స్‌లో అధిక కేలరీలు, ఉప్పు అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయి. క్యాండీలు, డెజర్ట్‌లు, చాక్లెట్లు పిల్లలకు ఇష్టమైన ఫుడ్స్. పిల్లుల స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువగా తింటే పళ్లు పుచ్చిపోతాయి. అంతేకాదు ఇవి అధిక బరువుకు దారి తీస్తాయి.
- పిల్లలు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ, ఐస్‌క్రీమ్ తినడం మంచిది కాదు. దీనిలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా అధికంగా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ పిల్లల బరువును పెంచేస్తాయి. మీ చిన్నారులకు ఐస్‌క్రీమ్ ఇష్టమైతే.. ఇంట్లోనే షుగర్ ఫ్రీ, లో క్యాలరీ ఐస్‌క్రీమ్ తయారు చేసి పెట్టడం మంచిది.
- నూడుల్స్ అంటే పిల్లలతోపాటు పెద్దలూ ఇష్టంగా తింటారు. అయితే, పిల్లలకు నూడుల్స్ పెట్టడం అంత మంచిది కాదు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువుకు కారణం అవుతాయి.
- టెట్రా ప్యాక్‌లలోని ఫ్రూట్ జ్యూస్‌లు, ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా ఊబకాయానికి దారి తీస్తాయి. వీటిలో చక్కెర స్థాయిలు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి వారి బరువును పెంచుతాయి. వీటికి బదులుగా తాజా పండ్ల రసాలు ఇవ్వడం మంచిది. వీటిలో ఫైబర్, పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఊబకాయానికి కారణమని వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను పూర్తిగా దూరం చేయవలసిన అవసరం లేదు. అలవాటుగా కాకుండా ఏదైనా ప్రత్యేకత గల రోజులలో సందర్బానుసారం వారికి ఇష్టమైనవి కొనిస్తూ ఉండటం మంచిది.