TDP BJP Alliance: చంద్రబాబుని BJP నమ్మడంలేదా?
TDP BJP Alliance: తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన పార్టీలు రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections) కలిసి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగానే ఇటీవల అభ్యర్ధులు.. వారు పోటీ చేయనున్న నియోజకవర్గాలను వెల్లడించారు. తొలి జాబితాలో జనసేన (Janasena) 24 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు దేశం పార్టీ మాత్రం 94 స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇక భారతీయ జనతా పార్టీ (BJP) కూడా కలిస్తే తెలుగు దేశం పార్టీ ఎన్ని ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది అనేది తెలుస్తోంది. ఇక జనసేనకు 3 ఎంపీ సీట్లు ఖరారు చేసింది. (TDP BJP Alliance)
ALSO READ: Janasena: ఆశలు అడియాసలై..!
భారతీయ జనతా పార్టీతో పొత్తు అటు తెలుగుదేశం పార్టీ (TDP) ఇటు జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్‌లు (Pawan Kalyan) పలుమార్లు ఢిల్లీకి వెళ్లి భారతీయ జనతా పార్టీ హైకమాండ్‌ను కలిసి వచ్చారు. పొత్తు విషయం గురించి చర్చించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రకటించేయాలని రిక్వెస్ట్ చేసారు. వీరి అభ్యర్ధన పట్ల భారతీయ జనతా పార్టీ హై కమాండ్ ఎలాంటి స్పందన ఇచ్చిందో తెలీదు కానీ బయటికి మాత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇదిగో ప్రకటించేస్తారు అదిగో ప్రకటించేస్తారు అంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం వీరితో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ సంగతి పక్కనపెడితే చంద్రబాబు నాయుడుతో పొత్తు అంటేనే ఈసారి బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు గెలిచేందుకు ముందు అన్నింటికీ ఒప్పుకుని ఆ తర్వాత ప్లేటు ఫిరాయిస్తారు అనే టాక్ ఉంది. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు వల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోయింది.
పొత్తుకి BJP నో?
చంద్రబాబు నాయుడుతో పొత్తుకు BJP సిద్ధంగా లేదనే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సిద్ధంగా ఉండాలి. అలా ఉండాలి అంటే సీట్ల షేరింగ్, అభ్యర్ధుల జాబితా సిద్ధంగా ఉండాలి. ఇవేమీ లేకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టమవుతుంది. ఎందుకంటే అభ్యర్ధులకు ప్రచారం చేసుకునే సమయం ఉండదు. ఇదంతా తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం, జనసేన పార్టీలతో పొత్తు విషయంలో దోబూచులాట ఆడుతోంది.
చంద్రబాబు నాయుడుతో కలవలేం అని నేరుగా చెప్పలేక సాగదీస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2014లో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేసి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఈ కూటమితో పవన్ కళ్యాణ్ కలవలేదు కానీ మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు.. అంటే 2018లో NDA నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వచ్చేసారు. ఢిల్లీలో వరుసగా మీటింగ్‌లు ఏర్పాటుచేసేసి.. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని యత్నించారు. తీరా చూస్తే 2019 ఎన్నికల్లో YSRCP అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడం కోసం మాతో కలవండి అని చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తుంటే మళ్లీ హ్యాండ్ ఇస్తాడేమో అని BJP భయపడుతోంది. అందుకే పొత్తును ప్రకటించలేకపోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిని బట్టి చూస్తే 175 స్థానాల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగాలని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
BJPకి జనసేన నాయకులు
ఇప్పటికే జనసేనకు 24 సీట్లు ఇచ్చారని చాలా మంది నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బయటికి ఏమీ అనలేక మౌనంగా బాధపడుతున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే మాత్రం అసంతృప్తితో ఉన్న జనసేన నేతలు భారతీయ జనతా పార్టీకి వలసపోయే అవకాశం లేకపోలేదు.